| |
బాలుగారితో వైజయంతి మేడమ్
లెటర్ ఇచ్చేశానండీ..
వైజయంతి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిన రోజిది!
అక్టోబర్ 9, 2021.
అప్పుడే ఏడాదైందా!!!!!! అని ఆశ్చర్యపోడానికి లేదు. ఈ ఏడాదిలో వైజయంతిగారు రోజుకో ఏడాదిగా గడిపి ఉంటారని ఆమె గురించి తెలిసినవారెవరైనా ఊహించగలరు.
అవసరంగానో, అత్యవసరంగానో వైజయంతిగారు ఈ ఉద్యోగంలోకి రాలేదు. ఇష్టంగా వచ్చారు.
పత్రికా రచన మేడమ్ ప్రాణం. దేశ, విదేశాలలో అందుబాటులో లేని వారిని, అజ్ఞాతంలో ఉండిపోయిన వారిని కూడా వెదకిపట్టి మరీ మేడమ్ ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.
‘‘జయంతిగారూ. ఫలానా ఐటమ్ కావాలి.." అని అడిగితే.. ‘‘అయ్యో! అది నా సబ్జెక్ట్ కాదండీ’’ అని మేడమ్ ఏనాడూ అనలేదు. సాహిత్యం, సంగీతం, భక్తి, సైన్స్, పాలిటిక్స్.. కుటుంబ బంధాలు.. అన్నిటిపైనా రాశారు. 13 ఏళ్ల పాటు ఇదే ఒరవడిలో, ఇదే ఉత్సాహంతో ఉద్యోగం చేశారు. నేను ఆమె సహోద్యోగి.
ఉద్యోగంలో వైజయంతి గారి పదమూడో ఏడు నడుస్తుండగా.. 2021 జూలై లో నాకు ఫోను.
అప్పుడు నేను సెలవులో ఉన్నాను. ఊళ్లో ఒక ముఖ్యమైన పని మీద.
‘‘మాధవ్ గారూ, రిజైన్ చేద్దామనుకుంటున్నాను..’’ అని వైజయంతి గారు!!!
‘‘ఏమైంది మేడమ్?!’’ అన్నాను.
ఏదో ఒకటి అవందే ప్రాణప్రదమైన చోటును వదిలి వెళ్లిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే.. ‘‘ఏమైంది మేడమ్?!’’ అని అడిగాను.
‘‘లెటర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నానండీ..’’ అన్నారు, ఏమైందో చెప్పకుండా.
‘‘నేను వచ్చేవరకు అగండి మేడమ్. నేను వచ్చాక లెటర్ ఇద్దురు గానీ..’’ అన్నాను.
అప్పటికి సరేనన్నారు.
నేను ఊరి నుంచి ఉద్యోగానికి తిరిగొచ్చాక కూడా తనెందుకు రిజైన్ చెయ్యాలనుకుంటున్నదీ వైజయంతిగారు నేను ఎంత అడిగినా చెప్పలేదు. నా రిక్వెస్ట్‌పై రిజైన్ లెటర్ ఇవ్వకుండానైతే కొన్నాళ్లు ఆగినట్లున్నారు.
తర్వాత ఓ రోజు హటాత్తుగా.. ‘‘లెటర్ ఇచ్చేశానండీ..’’ అని మళ్లీ నాకు ఫోన్!!
‘‘అయ్యో! ఎందుకు మేడమ్ అలా చేశారు?’’ అన్నాను.
‘‘అలానే చేయవలసి వచ్చిందండీ..’’ అని నవ్వుతూ అన్నారు.
తనెందుకు రిజైన్ చేసి వెళ్లిందీ ఈ రోజు వరకు వైజయంతి గారు నాకు చెప్పలేదు. మేడమ్ రిజైన్ చేసి ఆఫీస్ నుంచి వెళ్లిపోయే రోజు కూడా ఎవరికీ తెలీదు. ఎవరికీ చెప్పలేదట కూడా! (అప్పటికి నేను వేరే సెక్షన్‌కి మారిపోయి ఉన్నాను కనుక ఆ సంగతి నాకు తెలిసే అవకాశం లేకుండా పోయింది).
వెళ్లేటప్పుడు వైజయంతిగారు గేట్ బయట సెక్యూరిటీ దగ్గర ఆగి, సెక్యూరిటీవాళ్లతో కలిసి ఫొటో తీయించుకున్నట్లు.. తర్వాతెక్కడో ఆ ఫోటోలు చూశాక తెలిసింది!!
ఇవాళ్టికి సంవత్సరం.. వైజయంతిగారు తనకు ఇష్టమైన ఉద్యోగాన్ని వదిలేసి.
అప్పుడప్పుడు నేనే ఫోన్ చేస్తుంటాను... ‘‘ఎలా ఉన్నారు మేడమ్?’’ అని.
అప్పుడు కూడా.. ‘‘ఆఫీస్ సంగతులు ఏంటి మాధవ్ గారూ..’’ అని ఆమె ఒక్కమాట కూడా అనరు.
పూర్తిగా డిటాచ్ అయినట్లున్నారు.. తనకు ప్రాణప్రదమైన వర్కింగ్ ప్లేస్‌తో!!



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home